● సుమారు రూ.25 వేలకు పైగా పట్నాల దుస్తులు మిస్సింగ్ ● పట్టించుకోని అధికారులు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోని బుకింగ్‌లో పట్నాల దుస్తుల విషయంలో గోల్‌మాల్ జరిగింది. స్వామి వారికి రెండు రకాల పూజలు జరుపుతారు. అర్చుకులు స్వామి గర్భగుడిలో పూజలు నిర్వహిస్తే, ఒగ్గు పూజారులు ఆలయ పరిసరాలలో పంచవన్నెల రంగుతో పట్నం రచించి జానపద రీతిలో స్వామికి కల్యాణం జరిపిస్తారు. పట్నం వేయడానికి బుకింగ్‌లో డబ్బులు చెల్లించి రశీదు తీసుకుంటే ఒగ్గుపూజారులు పట్నం రచిస్తారు. బుకింగ్‌లో రశీదుతో పాటు భక్తులకు పట్నం వేయడానికి తెల్లని వస్త్రాన్ని ఆలయం అందిస్తుంది. ఆలయం వాటిని టెండర్ ద్వారా విక్రయిస్తుంది. ఒక్క పట్నం వేసేందకు కావాల్సిన తెల్లని వస్త్రాన్ని రూ.5 లకు కొనుగోలు చేస్తుంది. వీటి నిర్వహణ అంతా బుకింగ్‌లో పనిచేసే ఉద్యోగులు నిర్వర్తిస్తారు. ఇటీవల స్టాక్ పరిశీలిస్తే ఆ వస్త్రాలు సుమారు 25 వేలకుపైగా తక్కువ ఉన్నట్లు సమాచారం. వాటి విలువ సుమారు రూ.1.25 లక్షలు వరకు ఉంటుంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. యాదగిరి గుట్ట నుంచి బదిలీపై వచ్చిన ఓ ఉద్యోగిని బుకింగ్ ఇన్‌చార్జిగా నియమించడంతో బయట పడినట్లు, పూర్తిస్టాక్ అప్పగిస్తేనే బాధ్యతలు చేపడతానని సదరు ఉద్యోగి తెలిపినట్లు సమాచారం. వస్త్రాలకు సంబంధించిన డబ్బులు రికవరీ చేస్తారా? ఆ ఉద్యోగినిపై చర్యలు తీసుకుంటారా? లేదా వేచిచూడాల్సిందే.


