సిద్దిపేటలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన
సిద్దిపేటకమాన్: జీఓ నంబరు 97ను వెంటనే రద్దుచేయాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం పాలిటెక్నిక్ కళాశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులను ఇతర శిక్షణ కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్లొమా కోర్సులను మరింత బలోపేతం చేయాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థులు, విద్య నిపుణులతో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


