● 12న జాతీయ లోక్ అదాలత్ ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్
సిద్దిపేటకమాన్: లోక్ అదాలత్‌లో కక్షిదారులకు త్వరితగతిన, తక్కువ ఖర్చుతో న్యాయం అందడంతో పాటు, పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ అన్నారు. జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కోర్టులో పెండింగ్ కేసులు తగ్గుతాయన్నారు. పోలీసులు రాజీ పడదగిన కేసులను గుర్తించి పరస్పర అంగీకారంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్‌కుమార్, అదనపు డీసీపీ కుశాల్కర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జీవన్‌రెడ్డి, ఆత్మరాములు, నర్సింహులు, లావణ్య, కనకయ్య, ఏసీపీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


