సాక్షి, సిద్దిపేట: పసి వయసులోనే మత్తు మాయలో పడుతున్నారు. ఆట పాటలతో గడపాల్సిన మైనర్లు, యువత.. మత్తు పదర్థాల కోసం తిరుగుతున్నారు. మొదట స్నేహితుల ద్వారా పరిచయం.. ఆ తర్వాత అలవాటు.. చివరకు మత్తు కోసం ఏదైనా చేసేందుకు వెనకాడని పరిస్థితి. ఈనేపథ్యంలో పాఠశాలలో యాంటి డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో టీచర్, హెచ్‌ఎం, పోలీస్ కానిస్టేబుల్, విద్యార్థి ఉన్నారు.
25 ఏళ్లలోపు వారే..
జిల్లాలో వ్యసనపరులుగా మారుతున్న వారిలో 25 ఏళ్లలోపు వారు, కళాశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యువకులు బానిసలుగా మారడటంతో తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలు సైతం ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇటీవల డీ అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
రద్దీ లేని ప్రాంతాలే అడ్డాలు..
సిద్దిపేట పట్టణంలో ఎక్కువగా రద్దీ ఉండని ప్రాంతాలే గంజాయి విక్రయదారుల అడ్డాలుగా మారినట్లు తెలుస్తోంది. రంగనాయకసాగర్ కట్ట పైన, కోమటి చెరువు, సుడా రోడ్డు, సిరిసిల్ల, కరీంనగర్ రోడ్, పొన్నాల ఆటోనగర్ సమీప ప్రాంతాల్లో ఒక్కో సమయంలో ఒక్కో దగ్గరకు వ్యాపారులు వచ్చి గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారి వచ్చే సమయానికి గంజాయి సేవించే వారు, చాక్లెట్లు తినే వారు అక్కడికి చేరుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. చాక్లెట్లు తిన్న యువత, సిగరేట్‌లో గంజాయి ఆకులను పెట్టుకుని తాగి మత్తులో తూగిపోతున్న సంఘటన కన్పిస్తున్నాయి.
మూలాలు పట్టుకోవాలి
విద్యార్థి చేతిలో గంజాయి కనిపించినప్పుడు అతడిని మాత్రమే నిందిస్తే సమస్య పరిష్కారం కాదు. ఆ గంజాయి అతడి చేతికి ఎలా చేరింది? ఎవరు ఇచ్చారు? ఎక్కడ విక్రయిస్తున్నారు ? వెనక ఉన్న ముఠా ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి. మైనర్లను మత్త నుంచి బయటపడేయడంతో పాటు.. వారిని మత్తులోకి తాగుతున్న వారిని సైతం ఛేదించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పిల్లల ప్రవర్థనలో ఆకస్మిక మార్పులు, చదవుపై ఆసక్తి తగ్గడం తరచూ డబ్బులు అడగడం, కొత్త స్నేహితుల విషయంలో గోప్యత పాటించడం వంటి మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి. కాగా గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతోంది. పల్లెలకు సైతం పాకింది. ఏ ప్రాంతం నుంచి సరఫరా అవుతుంది ? రవాణాకు సహకరిస్తున్నవారెవరు గుర్తిస్తే దందాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలు చెబుతుంటాం
పాఠశాలలో విద్యార్థులకు జాగ్రత్తలు చెబుతున్నాం. మొబైల్, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా పడుతుంది. తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షణ చేయాలి. పిల్లలలో ఏదైనా మార్పులు కన్పిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలలకు సమీపంలో పాన్ షాప్‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– జగ్గు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, బడ్జెట్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ అసోసియేషన్
గుట్కాలు విక్రయించొద్దు
స్కూల్‌ల సమీపంలో పాస్ షాప్‌లలో గుట్కాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడం వల్ల చెడు మార్గంలో వెళ్లకుండా చేయవచ్చు. గంజాయి విక్రయాలపై పోలీసులు నిఘా పెంచాలి.
– ఇంద్రసేనా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ
సిద్దిపేట పట్టణంలో గత నెల 20న గంజాయి విక్రయిస్తూ మైనర్ బాలుడు పట్టుపడ్డాడు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి సిద్దిపేటలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ మైనర్ బాలుడి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 2026లో కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్ పరిఽధిలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకుని గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు చిక్కాడు. మొక్కలను ధ్వంసం చేసి ఎండబెట్టిన 140 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
2024లో చేర్యాలలోని ఓ పాన్‌షాప్‌లో గంజాయి చాక్లెట్లను బీహార్‌కు చెందిన వ్యకి విక్రయిస్తుండగా ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు.
గతంలో చేర్యాలలో చాక్లెట్ల రూపంలో విక్రయాలు
తొలుత సరదాగా.. ఆపై వ్యసనం తల్లిదండ్రులూ.. ఓ కన్నేయండి


