ఎంపీ రఘునందన్‌రావు
గజ్వేల్: సమాజాన్ని జాగృతం చేసే సత్తా ఫొటోగ్రఫీకి ఉందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం గజ్వేల్‌లో నిర్వహించిన ప్రపంచ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపన్యాసాలు మదిలో ఉండకపోయినా, ఫోటోలు మదిలో నిలిచిపోతాయన్నారు. మనిషి, మనసును కదిలించడమే ఫోటోగ్రఫీ లక్షణమన్నారు. ఈ వృత్తిలో కొనసాగే వారి కృషి అభినందనీయమని కొనియడారు. గజ్వేల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి సహకారం అందించనున్నట్లు ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, గజ్వేల్ ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి బాకీ సురేష్, సంయుక్త కార్యదర్శి మహేందర్, కోశాధికారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటకమాన్: జిల్లా కోర్టులో వచ్చే నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. సిద్దిపేట కోర్టులో బ్యాంకు మేనేజర్లు, బీమా కంపెనీలు, న్యాయవాదులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య తగ్గడంతో పాటు, కక్షిదారుల సమయం, డబ్బులు ఆదా అవుతాయన్నారు. వాహన ప్రమాద పరిహార కేసులు, బీమా సంబంధిత, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన రాజీ పడదగిన కేసులను గుర్తించి, వారితో చర్చలు జరిపి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోశ్‌కుమార్, తరణి, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటజోన్: పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్క పౌరుని బాధ్యతని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. బుధవారం పట్టణంలోని 4, 5, 6 వార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణ ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఆయన సైకిల్ పైన తిరుగుతూ పర్యవేక్షించారు. ఈసందర్భంగా రోడ్డు పక్కన చెత్త వేస్తున్న వారిని గుర్తించి రూ. వెయ్యి జరిమానా విధించారు. అనంతరం డంప్‌యార్డు తనిఖీ చేశారు. రిజిస్టర్ పరిశీలించి సూచనలు చేశారు. తడి చెత్త పరిమాణం, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. బయో గ్యాస్ తయారీ ప్లాంట్ తనిఖీ చేశారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు అన్వేష్, మహేష్ తదితరులు ఉన్నారు.
సిద్దిపేటఅర్బన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించినట్టు త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు బుధవారం తెలిపారు. అయిదుగురికి రూ.20,500 జరిమానా విధించగా, ఇద్దరికి మూడు రోజుల జైలుశిక్ష, ఒక్కరికి అయిదు రోజుల జైలుశిక్ష విధించినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.


