దుబ్బాక: ప్రతిపక్షాల గొంతునొక్కే చర్యలు సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అరాచకమా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకునే చర్యలు సిగ్గుచేటన్నారు. బుధవారం నియోజకవర్గ పర్యటనకు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయలు దేరిన ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరికాదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు వెళ్లకుండా బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల పర్యటనలకు అడ్డంకులు సృష్టించడం మానుకోవాలన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం


