గజ్వేల్‌రూరల్: మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం పంచాయతీ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐఓసీ వద్ద ధర్నా చేసి అనంతరం ఆర్డీఓ చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న జీపీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు స్వామి, జీపీ నాయకులు మహలక్ష్మి, బాబు, స్వామి, నాగరాజు, అనిల్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


