రోడ్డును బాగు చేయాలంటూ ధర్నా
రెండు గంటలకుపైగా బైఠాయింపు
దుబ్బాకరూరల్: మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామస్తులు గురువారం రోడ్డెక్కారు. కొన్నేళ్లుగా గుంతలమయమైన రోడ్డుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని ఆగ్రహించి హబ్సిపూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. రాత్రి వేళలో రోడ్డుపై వెళ్లాలంటే భయపడాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే చాలా మంది ప్రమాదాల బారినపడ్డారని తెలిపారు. వర్షం పడితే రోడ్డంతా బురదగా మారుతోందన్నారు. 15 ఏళ్ల క్రితమే రోడ్డుకు నిధులు మంజూరైనప్పటికీ టెండర్లు ఖరారు కాక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. పోలీసులు చేరుకుని ధర్నా చేస్తున్న వారికి నచ్చజెప్పి విరమింపజేశారు.


