● పెండింగ్ పనులు పూర్తి చేయాలి ● మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని శ్రీరామ వైకుంఠధామంలో చేపట్టిన బయోగ్యాస్ ఆధారిత ప్రక్రియ పనులు వేగవంతం చేయాలని, త్వరితగతిన ప్రారంభానికి సిద్ధం చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం ఆయన వైకుంఠధామాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచనలు చేశారు. శోకాన్ని మరిచేలా శ్మశానవాటిక అర్థం మారేలా సుందరీకరణ ఉండాలన్నారు. మరిన్ని మొక్కలు నాటాలని, సీసీ రోడ్లు వేయాలని, రాత్రి వేళల్లో దహన సంస్కారాలకు లైటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. టాయిలెట్స్‌కు మరమ్మతులు చేపట్టి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మాజీ కౌన్సిలర్ సత్తయ్య, వైకుంఠధామం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు రత్నాకర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


