డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్
గజ్వేల్: స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా ప్రభుత్వాస్పత్రుల ఇన్‌చార్జి కో ఆర్డినేటర్(డీసీహెచ్‌ఎస్), స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. ఆస్పత్రి తీరుపై తరుచూ వస్తున్న విమర్శలు, ‘సాక్షి’లో ఈనెల 10న ‘రెఫరల్ దందా’ పేరిట ప్రచురితమైన కథనం నేపథ్యంలో గురువారం గజ్వేల్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఆస్పత్రి పరిధిలో 100 పడకల సాధారణ ఆస్పత్రి, మరో 100 పడకలతో మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్) అందుబాటులో ఉండగా వివిధ రకాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సాధారణ ఆస్పత్రిలో అత్యవసర వైద్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడీయాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, నేత్ర వైద్యం, అనస్తీషీయా, రెడియాలజీ, డెంటల్, పాథాలజీ తదితర విభాగాల్లో రోగులకు సేవలందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా డయాలసిస్, ఆరోగ్యశ్రీ సేవలు అందించడమే కాకుండా రక్త నిల్వ కేంద్రం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ అందుబాటులోలేని కారణంగా సీరియస్‌గా ఉన్న కేసులను మాత్రమే రెఫర్ చేస్తున్నాన్నారు. ఇటీవల సాధారణ బదిలీల్లో నర్సింగ్ విభాగం నుంచి 13మంది ఏకకాలంలో బదిలీ కావడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు. సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.


