మంత్రి పొన్నంకు నమస్కరించి.. | - | Sakshi
Sakshi News home page

మంత్రి పొన్నంకు నమస్కరించి..

Aug 15 2026 7:23 AM | Updated on Aug 15 2026 7:23 AM

సిద్దిపేట పట్టణంలో లోకల్‌ బస్సులు నడపాలి ఆటో ఎక్కి దిగితే రూ.20లు వసూలు చేస్తుండ్రు

పాత బస్టాండ్‌లోకి కరీంనగర్‌ బస్సులు వచ్చేలా చూడాలి సమస్యలు పరిష్కరించాలంటూ పట్టణ ప్రజల లేఖ

సాక్షి, సిద్దిపేట: గౌరవనీయులైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నమస్కరించి రాయునది.. మేము సిద్దిపేట పట్టణ ప్రజలం.. మా ప్రాంతంలో లోకల్‌ ఆర్టీసీ బస్సులు నడపాలని విన్నపం. ప్రస్తుత సిద్దిపేట పట్టణం 25కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు విస్తరించి ఉన్నాయి. కొత్తకొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. పల్లె వెలుగు బస్సు ఎక్కుదామంటే డ్రైవర్‌ ఆపడం లేదు.. ఎక్కితే ఇది లోకల్‌ బస్సా అని టికెట్‌ ఇచ్చే సమయంలో కండక్టర్‌ దింపేస్తున్నారు.

ఈ రూట్‌లలో నడపాలని..

పాత బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు, కొత్త బస్టాండ్‌ నుంచి బూర్గుపల్లి, పాత బస్టాండ్‌ నుంచి మిట్టపల్లి, కొత్త బస్టాండ్‌ నుంచి రైల్వేస్టేషన్‌, కొత్తబస్టాండ్‌ నుంచి చిన్నకోడూరు, చింతమడక, తడ్కపల్లి, పొన్నాల వరకు ఇలా రూట్‌లలో లోకల్‌ బస్సులను నడిపితే మాకు ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే కోమటి చెరువుకు ప్రత్యేక బస్సులను నడిపితే మరింత పర్యాటకుల సంఖ్య పెరుగనుంది.

ఆటో ఎక్కి దిగితే రూ.20

మున్సిపాలిటీ పరిధిలో శ్రీనగర్‌ కాలనీ, భారత్‌నగర్‌, కోమటి చెరువు, ప్రశాంత్‌నగర్‌, అంబేడ్కర్‌ కాలనీ, లింగారెడ్డిపల్లి, నర్సాపూర్‌ చౌరస్తా, వ్యవసాయ మార్కెట్‌, రైల్వేస్టేషన్‌, రాఘవేంద్రనగర్‌, కోటి లింగాల దేవాలయం, ముస్తాబాద్‌ చౌరస్తా, విక్టరీ చౌరస్తా, హౌసింగ్‌ బోర్డు కాలనీ, బ్లాక్‌ఆఫీస్‌ చౌరస్తా, మారుతీ నగర్‌, రంగధాంపల్లి, మైత్రీవనం.. ఇలా చాలా కాలనీల ప్రజలంతా ఏదైనా పని నిమిత్తం వెళ్లాలంటే ఆటోలోనే వెళ్లాల్సి వస్తోంది. ఆటో ఎక్కి దిగితే రూ.20 వసూలు చేస్తున్నారు. పిల్లలు కాలేజీలకు వెళ్లాలంటే రోజుకు రూ.50 చెల్లించాల్సి వస్తోంది. రైలులో సికింద్రాబాద్‌కు వెళ్లాలన్నా.. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోకు ఒక్కరికి రూ.30 చెల్లించాల్సి వస్తోంది. అది సైతం రైలు వెళ్లే సమయం.. వచ్చే టైంకు ఆటోలు లేకపోవడంతో బైక్‌ల ద్వారా చేరుకోవాల్సి వస్తోంది.

పాత బస్టాండ్‌లోకి

కరీంనగర్‌ బస్సులు రావాలి..

జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌, అలాగే కరీంనగర్‌ నుంచి జేబీఎస్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు సిద్దిపేట కొత్త బస్టాండ్‌లోకి మాత్రమే వెళ్తున్నాయి. పాత బస్టాండ్‌లోకి వెళ్లకుండా రోడ్డుపైనే నిలుపుతున్నారు. బస్సుల కోసం రోడ్ల మీదనే ఎదురుచూడాల్సి వస్తోంది. ఎండకు ఎండుతూ... వర్షానికి తడుస్తూనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా బస్సులు రోడ్డుపైనే నిలుపుతుండటంతో ట్రాఫిక్‌ జాం సైతం అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మీరు మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రత్యేక చొరవ తీసుకుని మాపై దయవుంచి సిద్దిపేట పట్టణంతో పాటు సమీప గ్రామాలకు లోకల్‌ బస్సులను నడపాలని కోరుతున్నాం.

ఇట్లు

సిద్దిపేట పట్టణ ప్రజలు

బస్టాండ్‌ బయటే బస్సులు ఆపుతుండటంతో ఏర్పడిన ట్రాఫిక్‌ జాం

కరీంనగర్‌కు వెళ్లే బస్సు పాత బస్టాండ్‌ బయటే ఆపడంతో ప్రయాణికుల పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement