కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన 172 మంది రెగ్యులరైజ్ ఫేక్ సర్టిఫికెట్లు అందించిన ముగ్గురు అధ్యాపకులకు షోకాజు నోటీసులు వారంలో వివరణ ఇవ్వాలన్న ఇంటర్మీడియెట్ బోర్డు ముందే చెప్పిన ‘సాక్షి’
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్లతో రెగ్యులరైజ్ అయిన లెక్చరర్ల గుట్టురట్టయింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 2, 2014 వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన లెక్చరర్లను గత ప్రభుత్వం మే 2023లో రెగ్యులరైజ్ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను అందజేశారు. కొందరు ఆయా యూనివర్సిటీలలో ఆ కోర్సులు లేకున్నా ఆ యూనివర్సిటీలో చదవకుండానే ఆ కోర్సులు చదివినట్లుగా సర్టిఫికెట్లను అందజేసినట్లు ఇంటర్ బోర్డు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. పలువురు నకిలీ సర్టిఫికెట్లను అందించినట్లు ముందే చెప్పిన సాక్షి..గతేడాది అక్టోబర్ 15న ‘సాక్షి’లో ‘అమ్మో నకిలీ లెక్చరర్లు’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో సర్టిఫికెట్లను వేగంగా ఇంటర్మీడియెట్ అధికారులు తనిఖీలు చేసి గుర్తించారు.
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారిలో జిల్లా నుంచి 172 జూనియర్ కళాశాల అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్దీకరించారు. అందులో దాదాపు 15 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో అభ్యసించినట్లు ధ్రువపత్రాలను అందజేశారు. వాటిని పరిశీలన కోసం ఆయా వర్సిటీలకు లేఖలు రాశారు. ప్రస్తుతానికి జిల్లాకు చెందిన ముగ్గురు అధ్యాపకుల సర్టిఫికెట్లు, ఆ యూనివర్సిటీతో సంబంధం లేనట్లు తేలినట్లు సమాచారం. అలహాబాద్ యూనివర్సిటీలో చదివినట్లు చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కెమిస్ట్రీ అధ్యాపకుడు ప్రసాద్, లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీలో అభ్యసించినట్లు చేర్యాలలోని జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ పరుశరాములు, బుందేల్‌ఖండ్ యూనివర్సిటీలో చదివినట్లు ధ్రువపత్రాలను గజ్వేల్‌లోని జూనియర్ కళాశాలలో ఓకేషనల్ అధ్యాపకుడుగా పనిచేస్తున్న అష్రాఫ్ అందజేశారు. ఈ ముగ్గురు అధ్యాపకులకు ఇంటర్ బోర్డు షోకాజు నోటీసులను జారీ చేసింది. శుక్రవారం రాత్రికి జిల్లాకు రాగా ఆ ముగ్గురు అధ్యాపకులకు నోటీసులు అందించాలని ఆయా ప్రిన్సిపాల్‌లకు పంపించారు. నోటీసులు అందుకున్న వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
మరి కొందరిలో మొదలైన గుబులు
రెగ్యులరైజ్ అయిన అధ్యాపకులలో మరికొంత మంది సైతం ఫేక్ సర్టిఫికెట్లు అందించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఫేక్ సర్టిఫికెట్లను అందించిన వారిలో గుబులు మొదలైంది. తమపై సైతం వేటు పడుతుందా? అని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో విధులు నిర్వర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి
ఇంటర్ బోర్డు నుంచి వచ్చి షోకాజు నోటీసులను ఆయా కళాశాల ప్రిన్సిపాల్‌లలకు పంపించాం. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లు ఆ ముగ్గురు అధ్యాపకులకు అందించనున్నారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి ఉంటుంది.
–రవీందర్‌రెడ్డి, ఇంటర్ విద్యాశాఖ అధికారి


