జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు చెరువులు, కుంటల్లోకి భారీగా వరద 10 మండలాల్లో భారీ వర్షపాతం నమోదు ఆనందంలో రైతన్నలు
అన్ని మండలాల్లో మంచి వర్షపాతం
దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం, శనివారం తెల్లవారు జామున జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి జోరుగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే జిల్లాలోని చాలా చెరువులు, కుంటల్లో సగానికి పైగా నీరు నిలువ ఉండటంతో ఈ వర్షాలకు పెద్ద ఎత్తున వరద చేరడంతో చెరువులు, కుంటలకు మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. పొలాల్లో ఎటు చూసినా వరద ప్రవహిస్తోంది. భారీ వర్షానికి మురికి కాలువల్లో వరద రోడ్లపై నుంచి ప్రవహించింది. వరిపంటలు నీటిలో మునిగిపోయి నష్టం వాటిల్లింది. చాలా రోజుల తర్వాత మంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చెరువులు,కుంటల్లోకి వరద
మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కాలువల ద్వారా వేసవిలో జిల్లాలోని సిద్దిపేట, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, దుబ్బాక, నంగునూర్, చిన్నకోడూర్, కొండపాక, గజ్వేల్, తొగుట మండలాల్లోని పలు చెరువులు నింపారు. దీంతో ఇప్పటికే చాలా చెరువుల్లో సమృద్ధిగా నీరు నిల్వ ఉండగా భారీ వర్షానికి వరద చేరడంతో చాలా చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుంది.
సంతోషంలో రైతన్నలు..
వానకాలం ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో అంతంత మాత్రంగానే వానలు పడటంతో వ్యవసాయ పనులు నత్తనడకన సాగాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా జోరువానలు పడుతుండటంతో రైతులు సంతోషంలో ఉన్నారు. వరినాట్లు వేసుకోవడ, కొత్తగా నార్లు పోసుకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు.
పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు
జిల్లాలోని 26 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుబ్బాకలో శనివారం 5.9 .శుక్రవారం 7, సిద్దిపేట అర్బన్‌లో 7.7, శనివారం 4.2, సిద్దిపేట రూరల్‌లో 7.5, 3.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు,మర్కూక్ మండలాల్లో శనివారం 6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం 3.9 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. జిల్లాలోని 10 మండలాల్లో సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో రెండు రోజుల నుంచి మంచి వర్షం కురిసింది. భారీ వర్షంతో చెరువులు, కుంటల్లోకి వరద భారీగా చేరడం సంతోషం. మంచి వానలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి.
–మల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి


