కలప దందాను అరికట్టాలి
మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నినాదం గోడమీద రాతలుగానే మిగిలిపోతోంది. అధికారులకు ఆమ్యామ్యాల ఎరజూపి యథేచ్ఛగా వృక్ష సంపదను అక్రమార్కులు అనుమతుల్లేని ఇటుకబట్టీలకు తరలించేస్తున్నారు. మిరుదొడ్డితోపాటు దుబ్బాక, తొగుట, దొమ్మాట రాయపోలు మండలాలల్లో చీకటి మాటున అక్రమంగా కలప తరలిపోతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అమాయక రైతులను ఆసరా చేసుకుని అక్రమార్కులు పట్టా భూముల్లో ఉన్న చెట్లను నరికివేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వృక్ష సంపదను నరికించి రాత్రివేళల్లో లారీల్లో, ట్రాక్టర్లలో యథేచ్ఛగా అక్రమంగా కలప జోరుగా తరలిపోతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కానరాని కమిటీలు
సహజ వనరులను సంరక్షించేందుకు గతంలో రెవెన్యూ, అటవీ, పోలీస్, గ్రామ కమిటీ, వీఎస్ కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలు కూడా కలప తరలింపుపై చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే కలపను యథేచ్ఛగా నరికేస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా తరలిస్తున్న కలప వాహనాలను పట్టుకున్న అధికారులు తూతూమంత్రంగా జరిమానాలు విధించి విడిచిపెట్టేస్తున్నారన్న ఆరోపణలు సైతం విపిపిస్తున్నాయి. అక్రమంగా చెట్లను నరికి కలపను తరలిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించి కలప దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమంగా తరలిపోతున్న వృక్ష సంపదపై అధికారులు దృష్టి సారించాలి. అక్రమార్కుల చేతిలో పచ్చని చెట్లు నేలవాలుతున్నాయి. విలువైన వృక్ష సంపద అక్రమార్కుల చేతిలో గొడ్డలి వేటుకు బలైతే పర్యావరణానికే ముప్పు వాటిల్లుతుంది. మొక్కలు నాటడంలో ఉన్న శ్రద్ధ అక్రమార్కుల చేతిలో తరలిపోయే కలప రవాణాకు అడ్డుకట్టపై ఉండటం లేదు. అనుమతుల్లేని ఇటుకబట్టీలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికై నా పర్యావరణ కమిటీలు మేలుకుని ప్రకృతి ఒడిలోని పర్యావరణాన్ని కాపాడేలా పాటు పడాలి.
– పి.శంకర్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి
నియోజకవర్గంలో అక్రమార్కులు అమాయక రైతులను ఆసరాగా చేసుకుని పంట పొలాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా మట్టిని తరలిస్తూ, ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో పర్యావరణం మరింత దెబ్బ తింటోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తుండటంతోపాటు, బట్టీలను కాల్చడానికి కలపను అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ప్ర భుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.


