సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
చుక్క రాములు
చేర్యాల(సిద్దిపేట): అమరజీవి, మాజీ ఎమ్మెల్యే ఏసీరెడ్డి నర్సింహారెడ్డి ఆశయ సాధనకు బలమైన శ్రామిక వర్గ, ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు అభిప్రాయపడ్డారు. పట్టణంలోని వాసవిగార్డెన్‌లో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏసీరెడ్డి 35వ వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఏసీరెడ్డి నైజాం రజాకార్లు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన త్యాగం నేటితరానికి ఆదర్శమని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ లేబర్ కోడ్ల ద్వారా కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల దరల పెరుగుదలతో పాటు నిరుద్యోగం, పేదరికం పెరగడానికి కేంద్ర ఆర్థిక విధానాలే కారణమని ఆరోపించారు. అనంతరం ఏసీరెడ్డి పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు గోపాలస్వామి, శశిధర్, సత్తిరెడ్డి, వెంకట్‌మావో, లావణ్య, రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్
చైర్‌పర్సన్ చందన
గజ్వేల్: ప్రస్తుత వానాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ చందన సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశం ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలో చెత్త సేకరణ వంద శాతం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. పట్టణంలో గ్రామ కంఠంలో నిర్మించుకున్న ఇళ్లకు ఇంటినంబర్ కేటాయించాలని కౌన్సిలర్లు ఈ సందర్భంగా చైర్‌పర్సన్ చందన, కమీషనర్ గణేశ్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ పద్మబాయిలకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో మున్సిపల్‌లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకృతిలో లభించేదే ఆరోగ్యకరం
ట్రస్మా స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రకృతిలో లభించే ప్రతీ చెట్టు ఆరోగ్యకరమేనని ట్రస్మా స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ పాఠశాలలో మంగళవారం ఆషాఢమాస గోరింటాకు ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు గోరింటాకును తయా రు చేసి, ఒకరికి ఒకరు పంచుకుని సంతోష పడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ...మన సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులకు చాటి చెప్పాలన్నారు. సహజమైన గోరింటాకుతో ఆరోగ్యానికి ఆహ్లాదం, చల్లదనాన్ని పొందవచ్చని తెలిపారు. తెలుగు సంప్రదాయాన్ని, పిల్లలకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.


