● ఉద్యోగం పొందడం కాదు ఇచ్చే స్థాయికి రావాలి ● మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేటజోన్: అఖిల భారతస్థాయి సేవల్లో మన పాత్ర ఉండాలని విద్యార్థులనుద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేఆర్ ఉచిత ఇంజనీరింగ్, కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో ఇటీవల ఐఐటీ, నీట్, ట్రిపుల్‌ఐటీలలో సీట్లు సాధించిన విద్యార్థులకు బుధవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట పిల్లలు జాతీయస్థాయి సంస్థల్లో ప్రవేశాలు పొందడం సంతోషంగా ఉందన్నారు. ఒక్క సీటుతో ఆ విద్యార్థి జీవితంతోపాటు వారి కుటుంబ ఆర్థికస్థితిగతులు పూర్తిగా మారిపోతాయన్నారు.ఐఐటీ, ఎన్‌ఐటీ పూర్తి కాగానే విద్యార్థులు ప్రైవేటు ఉద్యోగాల్లో చేరిపోవడం కాకుండా సివిల్ సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, డిఫెన్స్ తదితర ఆల్‌ఇండియా సర్వీసెస్ వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగాలను అడిగే వారిగా కాకుండా మీరే పదిమందికి ఉద్యోగాలను ఇచ్చే స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఏఐ వచ్చాక ప్రపంచం మొత్తం యువత చేతుల్లో ఉందని, వినూత్న ఆలోచనలతో గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలను ఆకర్షిస్తున్నట్లు గుర్తు చేశారు.
సిద్దిపేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రం
సిద్దిపేటలో త్వరలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి తరహా లో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయను న్నట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో హైదరాబాద్‌కు చెందిన సింధు క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా వ్యాధిని జయించవచ్చన్నారు. సిద్దిపేటలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వెయ్యి పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే మిగిలిన ఐదు శాతం పనుల కోసం నిధులు మంజూరు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో సింధు ఆస్పత్రి వైస్ చైర్మన్ గోపాలకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లేశం, డాక్టర్ త్రిష తదితరులు పాల్గొన్నారు.


