డెలివర్రీస్‌ | - | Sakshi
Sakshi News home page

డెలివర్రీస్‌

Aug 2 2026 7:26 AM | Updated on Aug 2 2026 7:26 AM

● ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా శస్త్రచికిత్స ప్రసవాలు ● కరువైన వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలు ● సిజేరియన్లు తగ్గించాలని డీడీఆర్‌సీ సమావేశంలో చెప్పినా పట్టింపేదీ?

● ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా శస్త్రచికిత్స ప్రసవాలు ● కరువైన వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలు ● సిజేరియన్లు తగ్గించాలని డీడీఆర్‌సీ సమావేశంలో చెప్పినా పట్టింపేదీ?

బిడ్డ అడ్డం తిరిగిందంటారు..ఉమ్మనీరు తగ్గిందంటారు..బిడ్డ బరువు ఎక్కువగా ఉందంటారు. ఆలస్యం చేస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదమని హడలెత్తిస్తారు. చివరకు కడుపు కోసి బిడ్డను బయటకు తీస్తారు. వేలాది రూపాయలు డబ్బులు దండుకుంటారు. జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇదే జరుగుతోంది. జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఎవరైనా ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యమైంది.

సాక్షి, సిద్దిపేట: జిల్లాలో సర్కారు దవాఖానాల కంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా అవుతున్నాయి. సిజేరియన్లను నియంత్రించాలని జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు చెప్పినా జిల్లా వైద్యారోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. ఈ శాఖ నుంచి ఆదేశాలు వస్తే తప్ప అధికార యంత్రాంగం కాలు కదపడం లేదు. అది కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేసి తప్పుడు నివేదికలు పంపి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి.

15 నెలల్లో సిజేరియన్‌ ప్రసవాల విలువ రూ.21.21కోట్లు

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 15 నెలల కాలంలో సిజేరియన్ల కోసం గర్బిణీల నుంచి ప్రసవాల కోసం రూ 21.21కోట్లను ముక్కు పిండి వసూలు చేశారు. 2025–26 ఆర్థిక ఏడాదిలో జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరిగిన సిజేరియన్ల విలువ రూ17.48కోట్లు. అంటే...సిజేరియన్‌ పేరిట ప్రైవేట్‌ వైద్యులు ఏటా రూ.17కోట్ల మేరకు వసూలు చేస్తున్నారు. అలాగే ఏప్రిల్‌ 2026 నుంచి జూన్‌ 2026 వరకు ఈ మూడు నెలల్లోనే రూ 3.73కోట్లను పిండుకున్నారు.

11 శాతమే సాధారణ ప్రసవాలు

2025–26లో మొత్తంగా 11,868 ప్రసవాలు కాగా అందులో ప్రభుత్వాస్పత్రుల్లో 6,902, ప్రైవేట్‌లో 4,966 డెలివరీలు అయ్యాయి. అందులో ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు 3,009, సిజేరియన్లు 3,893, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 4,966 డెలివరీలు కాగా అందులో నార్మల్‌ డెలివరీలు 595 మాత్రమే. సిజేరియన్లు 4,371 చేశారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కేవలం 11.98% సాధారణ ప్రసవాలు, 89.02శాతం సిజేరియన్‌ ప్రసవాలు అయ్యాయి.

ప్రైవేట్‌లో సిజేరియన్‌కు రూ.40వేలు

ప్రతీ మహిళకు మాతృత్వం వరం లాంటిదంటారు. కానీ...ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులకు, డాక్టర్లకు మాత్రమే అది వరంలా మారింది. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆడబిడ్డలకు గర్భం వచ్చిందన్న సంతోషం కంటే ప్రసవ ఖర్చుల భయమే వెంటాడుతోంది. నార్మల్‌ డెలివరీకి రూ.20వేలు, సిజేరియన్‌ రూ.40వేలు ప్యాకేజీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డెలివరీ అంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. సిజేరియన్‌ ప్రసవాల వల్ల మహిళలకు భవిష్యత్‌లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించి కట్టడి చేయాలని, అలాగే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యారోగ్య శాఖ తనిఖీలు పెంచి సిజేరియన్లు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

ఏప్రిల్‌ 2026 నుంచి జూన్‌ 2026 వరకు

డెలివరీ ప్రభుత్వ ప్రైవేట్‌ మొత్తం

సాధారణ 615 95 710

సిజేరియన్‌ 870 934 1,804

మొత్తం 1,485 1,029 2,514

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement