గజ్వేల్‌రూరల్: ప్రజాయుద్ధనౌక గద్దర్ 3వ వర్ధంతి సభను ఈ నెల 6న హైద్రాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి తెలిపారు. సభకు సంబంధించిన కరపత్రాలను శనివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆవిష్కరించారు. ఈ సభకు ప్రజలందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు సంజీవ్, వేణు, యాదగిరి, శ్రీనివాస్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మాలల రోస్టర్‌ను సవరించాలి
గజ్వేల్‌రూరల్: ఎస్సీ మాలల రోస్టర్‌ను సవరించి న్యాయం చేయాలని ఎంసీఎఫ్ (మాలల కో ఆర్డినేషన్ ఫోరం) రాష్ట్ర నాయకురాలు బండ శకుంతల డిమాండ్ చేశారు. గజ్వేల్‌లోని అంబేడ్కర్ భవన్‌లో శనివారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ..ఎస్సీ మాలలకు రోస్టర్ పాయింట్లు 22 కేటాయించడం వల్ల విద్య, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. మాలల రోస్టర్ పాయింట్‌ను 22 నుంచి 12కు తగ్గించాలని డిమాండ్ చేశారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేసి దళితుల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు మాధవి, విశాలక్ష్మి, సతీశ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక పటం ఆవిష్కృతం
వ్యవసాయ విద్యార్థుల రావెప్ కార్యక్రమం
వర్గల్(గజ్వేల్): గ్రామీణ పటం ఆవిష్కృతమైంది. గ్రామ భౌగోళిక నమూనా, సాగు భూములు, నీటి వనరులు, బడి, గుడి, ఆస్పత్రి, ఇళ్లు, రోడ్లు తదితర దృశ్యాలు ప్రతిబింబించే సామాజిక మ్యాపింగ్ ఆకట్టుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ నాలుగో సంవత్సర విద్యార్థులు క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా శనివారం వర్గల్ మండలం గౌరారం, శేరిపల్లిలో రైతులతో కలిసి మ్యాపింగ్ చేసి ప్రదర్శించారు. పంట దిగుబడుల పెంపు, చీడపీడల నివారణ, ఆధునిక సాగు పద్ధతులపై రైతులతో ముఖాముఖి నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు కనకరాజుగౌడ్, పావని మోహన్‌రెడ్డి, రావెప్ ఇన్‌చార్జి, సీనియర్ సైంటిస్టు డాక్టర్ పల్లవి, ప్రియదర్శిని, విద్యార్థినులు పూజ, డోనా మరియా, ఇషిక, రైతులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లోనే
గుణాత్మకమైన విద్య
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్య లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం జిరాక్స్ మెషీన్, వాటర్ ప్యూరిఫయర్‌ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ...పాఠశాల విద్యాభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరిస్తేనే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు.
పీఎస్‌బీతో నేలకు జీవం
నర్సాపూర్ రూరల్: రసాయన ఎరువులకు బదులు పీఎస్‌బీతో మంచి దిగుబడులు సాధించవచ్చని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని అవంచలో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా పీఎస్‌బీపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకంతో భూములు పాడవుతాయని వివరించారు.


