అధికారుల సమీక్షలో కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిపై కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా, కొన్ని పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్నాయన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరేలా అధికారులు ఆయా పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఎస్‌ఐఆర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఈ నెల 10 వరకు ఎన్నికల సంఘం పొడిగించినందున ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత ఆగస్టు 17న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తామని, దీనిపై సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 16 నాటికి వాటిని పరిష్కరిస్తుందని తెలిపారు. అక్టోబర్ 19న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తుందన్నారు. ఈ ప్రక్రియలో చనిపోయిన ఓటర్లు, డబుల్ ఓటరు, పూర్తిగా షిఫ్ట్ అయిన ఓటర్లను తీసివేయగా జిల్లాలో 99.75% ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. 1,200 మంది ఓటర్ల సంఖ్య దాటిన పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ గురించి చర్చించారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ భవ్య, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.


