మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్‌నినోను ఎదుర్కొని నీటి వనరులను సృష్టించాలి సమావేశానికి గైర్హాజరైన అధికారులపై మంత్రి ఆగ్రహం
హుస్నాబాద్‌రూరల్/హుస్నాబాద్: పల్లెలో తాగు నీరు, విద్యుత్ సమస్యలు రాకుండా అధికారులు, సర్పంచ్‌లు కలిసి చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సర్పంచ్‌లతో కలిసి గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. తాగునీటికి మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలేర్పడితే స్థానిక నీటి వనరులను సృష్టించుకోవాలన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసిన గ్రామాలకు రూ.5లక్షలు, ప్రైవేటు పాఠశాల బస్సులను బంద్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచిన గ్రామాలకు రూ.5లక్షలు, ఇంకుడు గుంతలు, బోరు బావుల రీ చార్జి, నీటి కుంటల తవ్వకం చేపట్టి మండలంలో మొదటి మూడు గ్రామాలకు రూ. 15 లక్షల అభివృద్ధి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆగష్టు 15 వరకు టెండర్లు అయిన పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టర్ల లైసెన్స్‌ను బ్లాక్ లిస్టులో పెట్టి టెండర్లు రద్దు చేయించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ ఏఈలు ఇద్దరు గైర్హాజరు కావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
ఎల్లమ్మ దేవాలయంలో చంఢీ హోమం
గురు పౌర్ణమి సందర్బంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన చంఢీ హోమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ప్రతీ పౌర్ణమికి నిర్వహించే మహా గణపతి పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు.


