● మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ● మంత్రిని కలిసిన దుబ్బాక చేనేత సహకార సంఘం నాయకులు
దుబ్బాక/ములుగు(గజ్వేల్): చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధుతోపాటు పాలకవర్గ సభ్యులు బుధవారం మంత్రి తుమ్మలను కలసి చేనేత సొసైటీ కోసం గతంలో ఏపీస్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పు రూ.1.67 కోట్లను రుణమాఫీ చేయాలని కోరారు. కార్మికులకు చేతినిండా పనికల్పించాలని ఇందుకు చేనేత సహకార సంఘానికి కావాల్సిన ముడిసరుకు నిమిత్తం వర్కింగ్ క్యాపిటల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ..రుణమాఫీతోపాటు వర్కింగ్ క్యాపిటల్‌ను ఇస్తామని హామీనిచ్చారు.
మంత్రికి ఉద్యాన విద్యార్థుల వినతి పత్రం
ములుగులోని కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి కళాశాలకు సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ కోర్సు, ఉద్యాన కళాశాల ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఉద్యాన విద్య కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలోనే కొనసాగించేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉద్యాన శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యాన విస్తరణాధికారులు(హెచ్‌ఈఓ), ఉద్యాన అధికారుల(హెచ్‌ఓ) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థుల డిమాండ్‌లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసిన వారిలో ఉద్యాన విద్యార్థి నాయకులు సంగారెడ్డి, సాయికిరణ్, చంటి తదితరులున్నారు.


