సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 20న నిర్వహించనున్న దృష్ట్యా కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ రష్మీ పెరుమాళ్ సూచించారు. ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌తోనే సత్వర న్యాయం అందుతుందన్నారు. చిన్న చిన్న కేసులలో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి ఇది మంచి అవకాశమన్నారు. సివిల్, ఆస్తి విభజన, రోడ్డు ప్రమాదాలు, డ్రంకెన్ డ్రైవ్, న్యూసెన్స్, చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చని అన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృధా చేసుకోవద్దన్నారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు అవగాహన కల్పించాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు.
కళాశాలల్లో
అడ్మిషన్లు పెంచండి
డీఐఈఓ రవీందర్‌రెడ్డి
చేర్యాల(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచేలా ప్రిన్సిపాల్, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి సూచించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల రికార్డులను, బోధన–అభ్యసన కార్యక్రమాలు పరిశీలించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా పురోగతి, హాజరు, కళాశాల వాతావరణంపై ఆరా తీశారు. అనంతరం అధ్యాపక సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యోతి, కళాశాల అధ్యాపకులు ఉన్నారు.
మెరుగైన వైద్య సేవలు
అందించండి
డీఎంహెచ్‌ఓ ధనరాజ్
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ ధనరాజ్ సూచించారు. గురువారం చిన్నకోడూరు, ఇబ్రహీంనగర్ పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రోగులకు అందించే మందులు, ల్యాబ్‌లు, పీహెచ్‌సీ పరిసరాలు పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆయనతో పాటు పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
పాలిటెక్నిక్‌తో ఇంజనీరింగ్ విద్యకు అవకాశం
నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈసెట్ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చని ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఈసెట్ కౌన్సెలింగ్‌కు గురువారం 344 మంది విద్యార్థులు హాజరయ్యారు. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం విద్యార్థులకు వెబ్ ఆప్షన్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కౌన్సెలింగ్ ఇన్‌చార్జి అభినవ్, అధ్యాపకులు షెహబాజ్, రాజు, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, మధుబాబు, రాజమౌళి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


