హుస్నాబాద్‌ అంటే కేసీఆర్‌కు నమ్మకం | - | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌ అంటే కేసీఆర్‌కు నమ్మకం

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

ఏ ఎన్నికలైనా శంఖారావాన్నిపూరించేది ఇక్కడి నుంచే ఓట్లు గల్లంతు కాకుండా ఏజెంట్లు బాధ్యత తీసుకోవాలి మాజీ మంత్రి హరీశ్‌రావు

హుస్నాబాద్‌: ‘కేసీఆర్‌కు హుస్నాబాద్‌ అంటే చాలా నమ్మకం. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు’ అని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆర్డీఓ కార్యాలయం, మహాసముద్రం గండి, మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి, జాతీయ రహదారి, గౌరవెల్లి ప్రాజెక్టును 90 శాతానికి పైగా పూర్తి చేసి హుస్నాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో 3,400 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డంకులు సృష్టించి గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేయించి ధర్నాలు చేయించిందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వని స్పెషల్‌ ప్యాకేజీని గౌరవెల్లి నిర్వాసితులకు ఇచ్చామన్నారు. ట్రయల్‌ రన్‌ చేసి ఇచ్చాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడిచినా 30 గజాల కాలువ తవ్వలేదన్నారు. పాలమూరు పులి బిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డికి పాలమూరు ప్రాజెక్టుపై అవగాహన రావడానికి రెండున్నర ఏళ్లు పట్టిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు అర్థం కావడానికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందోనని అన్నారు.

పోలింగ్‌ ఏజెంట్లు బాధ్యత తీసుకోవాలి

ఎస్‌ఐఆర్‌ అనేది ఏదో భూతం కాదని 20 ఏళ్లకోసారి వస్తుందని హరీశ్‌రావు అన్నారు. డబుల్‌ ఓట్లు, చనిపోయిన ఓటర్లను తొలగించి అసలైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం తయారు చేస్తోందన్నారు. ఎన్నికల అధికారులకు ఎంత బాధ్యత ఉంటుందో పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా అంతే బాధ్యత ఉండాలన్నారు. నెల రోజుల పాటు స్థానిక అధికారులతో కలిసి పని చేయాలన్నారు.

రూ.2 వేల కోట్లు దగా..

ధాన్యం కొనుగోళ్లలో రైతుల నుంచి 3 నుంచి 5 కిలోల వరకు కోత విధించారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కోత విధిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తామని చెప్పిన లక్ష్మణ్‌.. రాజీనామా అవసరం లేదని దగాపడ్డ వ్యత్యాసాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కుమ్మక్కు వల్లనే మిల్లర్లు రూ. 2 వేల కోట్ల వరకు దగా చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేలో బడుగు బలహీన వర్గాల జనాభా 51 శాతం వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నిర్వహించిన కుల గణనలో బీసీ జనాభా 46 శాతం వచ్చిందన్నారు. 5 శాతం జనాభా మాయమైందని దీనికి మంత్రి పొన్నం జవాబు చెప్పాలన్నారు. సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి జీవీ రామకృష్ణారావు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement