పెద్దగుండవెల్లిలో స్కూల్ బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
దుబ్బాకరూరల్: మండల పరిధిలోని పెద్దగుండవెల్లిలో గ్రామస్తులు బుధవారం ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుకున్నారు. ‘ప్రైవేట్ వద్దు.. సర్కారు బడే ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లడానికి ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉదయాన్నే గ్రామానికి వచ్చాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకుని నిలిపి వేశారు. ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల్లో అనుభవం లేని ఉపాధ్యాయులు బోధిస్తారని, నాణ్యమైన విద్య ఉండదని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు.


