● కలెక్టర్ హైమావతి ● పలు పాఠశాలల సందర్శన
చిన్నకోడూరు(సిద్దిపేట): మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం మండల పరిధిలోని రామంచ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, బియ్యం, కూరగాయల నాణ్యత ఎలా ఉందని ఆరా తీశారు. విద్యార్థినులను ఆప్యాయంగా పలకరించారు. నాణ్యమైన ఆహారపదార్థాలను వాడుతూ రుచికరంగా వండాలని సూచించారు. విద్యార్థినులు కడుపునిండా లినాలని, బాగా తింటేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు సత్తవ్వ, సురేశ్‌కుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.
హెచ్‌ఎం తీరుపై ఆగ్రహం
రామంచ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడం, హ్యాండ్ వాష్ వంటివి ఏర్పాటు చేయకపోవడం, విద్యార్థులకు ఒకే రకమైన కూర వండటంతో కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్‌ఎం సత్తవ్వపై తగు చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు.


