● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ● గౌరవెల్లి ప్రాజెక్టు సందర్శన
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టును పట్టించుకోవడంలేదని, గత బీఆర్‌ఎస్ హయాంలోనే 95 శాతం పూర్తయినా చిన్నపాటి పనులు చేయలేకపోతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఓట్ల రాజకీయం చేసుకోవడానికి ప్రాజెక్టును మంత్రి పొన్నం ప్రభాకర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టును బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుని కనీసం పట్టించుకోకుండా పాలనా కొనసాగిస్తున్న మంత్రి పొన్నంకు సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు తట్టేడు మట్టిని ఎత్తని ప్రభుత్వమన్నారు. ప్రాజెక్టుని పూర్తి చేయకుండా నాటకాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి రైతాంగం కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమన్నారు.


