కాసులిచ్చుకో.. డిస్కౌంట్‌ పుచ్చుకో | - | Sakshi
Sakshi News home page

కాసులిచ్చుకో.. డిస్కౌంట్‌ పుచ్చుకో

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

మున్సిపల్‌ అధికారుల చేతివాటం పాష్‌ బిల్డింగ్‌లకు సైతం ఆర్డినరీ ఆర్‌సీసీ పన్ను పురపాలిక ఆదాయానికి భారీ గండి చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

ఇంటి పన్ను విధింపులో ఇష్టారాజ్యం

సిద్దిపేట మున్సిపాలిటీ భవనం

కేంద్ర రాజధాని పేరుతో ఉన్న ప్రైవేటు భవనం.. మున్సిపల్‌ అధికారుల లెక్కల ప్రకారం ఆర్‌సీసీ ఆర్డినరీ బిల్డింగ్‌. ఎలాంటి అనుమతులు లేకుండానే జీ ప్లస్‌ త్రీ భవనం నిర్మించారు. 2024లో ఈ భవనానికి జరిమానాతో కలిపి ఏడాదికి రూ. 3,12,512 విధించారు. ఇది పాష్‌ పరిధిలోకి రావాలి. దీనికి దాదాపు రూ.5లక్షలకు పైగా ఇంటి పన్నును విధించాలి. కానీ అధికారులు కాసులకు ఆశపడి పాష్‌ బిల్డింగ్‌ను కాస్త ఆర్‌సీసీ ఆర్డినరీగా చూపించారు. దీంతో మున్సిపల్‌ ఆదాయానికి గండి పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు.

సాక్షి, సిద్దిపేట: మున్సిపల్‌ అధికారులు ఇంటి పన్నుల విధింపుల్లో చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఎంతటి పెద్ద భవనమైనా.. జేబు తడిపితే చాలు ఇష్టారాజ్యంగా తక్కువ ఇంటి పన్ను విధిస్తున్నారు. భవనం మేరకు పన్ను విధించాల్సిన అధికారులు.. మున్సిపల్‌ ఆదాయం పెంచకుండా వారి ఆదాయం మాత్రం పెంచుకుంటుండటం గమనార్హం. ఈ విషయంలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద భవనాలకు సైతం తక్కువ ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

కమర్షియల్‌ భవనాలకు సైతం..

సిద్దిపేట పట్టణం మైత్రీవనంలోని హైదరాబాద్‌ రోడ్‌లో చాలా కమర్షియల్‌ భవనాలున్నాయి. ఆ భవనాలు అన్ని నివాస గృహాలకే మున్సిపల్‌ నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారి కావడంతో కమర్షియల్‌ భవనాలుగా కొనసాగుతున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో వ్యాపార సముదాయాలుగా గుర్తిస్తే మున్సిపల్‌కు ఆదాయం పెరగనుంది.

రూ.కోట్లలో గండి

సిద్దిపేట మున్సిపాలిటీ ఆదాయాన్ని అధికారులు పెంచాల్సిందిపోయి.. గండి పెడుతున్నారు. చాలా బిల్డింగ్‌లకు ఇంటి పన్ను తక్కువగా విధించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు జేబులు నింపుకుంటూ మున్సిపల్‌ ఆదాయానికి రూ. కోట్లలో గండి పెడుతున్నారు. సాధారణ గృహ యజమానులకు మాత్రం పూర్తిగా, డబ్బులు ఇవ్వనివారి గృహాలకు ఎక్కువగా ఆస్తి విధిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి ఆస్తి పన్నును ఇంటిని అనుసరించి విధించి పురపాలిక ఆదాయం పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

పన్ను విధింపుల్లో అవకతవకలు

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీల ప్రధాన ఆదాయ వనరుగా ఉండాల్సిన ఆస్తిపన్ను విధింపుల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలున్నాయి. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఎక్కువగా అధికారులు ఇష్టారాజ్యంగా పన్ను విధిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో పన్నుల ద్వారా ఏడాదికి రూ.80కోట్ల వరకు ఆదాయం వస్తోంది. వ్యాపార సముదాయాలు, బహుళఅంతస్తులు, పెద్ద వ్యాపార సంస్థలకు వాటి విస్తీర్ణం వినియోగం ఆధారంగా పన్నులు విధించాల్సి ఉంటుంది. అయితే కొందరు ఉన్నత అధికారులు, కింది స్థాయి అధికారులు, సిబ్బంది కలిసి పాష్‌ భవనాలను .. ఆర్డినరీ భవనాలుగా నమోదు చేసి విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి పన్నులు తగ్గిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement