ఐఐటీ, జేఈఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ, జేఈఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

ఐదు మట్టి టిప్పర్ల పట్టివేత

జిల్లా విద్యాశాఖ అధికారి శాస్త్రి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ, నీట్‌, క్లాట్‌లలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వరగంటి శాస్త్రి సోమవారం తెలిపారు. ఇందుకు జిల్లాలోని 23 కేజీబీవీలలో 6వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కేజీబీవీ నర్మేటలో ఐఐటీ, జేఈఈకి 20 సీట్లు, కేజీబీవీ రాఘవాపూర్‌లో నీట్‌కు 20 సీట్లు, కేజీబీవీ మిరుదొడ్డిలో క్లాట్‌(సీఎల్‌ఏటీ)కు 20సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అయితే ఇందులో విద్యను అభ్యసించాలంటే విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరుకావాలన్నారు. ఈ నెల 22న మధ్యాహ్నం 2గంటల వరకు దరఖాస్తులను సంబంధిత కేజీబీవీలలో అందించాలన్నారు. ప్రవేశ పరీక్ష జూలై 12న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందన్నారు.

ఏఐ డిజిటల్‌ లెర్నింగ్‌పై శిక్షణ

గజ్వేల్‌రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏఐ డిజిటల్‌ లెర్నింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు గజ్వేల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్‌) విద్యార్థులు తర్ఫీదు పొందుతున్నారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్‌ హబ్‌లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ అనుబంధ సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన అధ్యాపకులు డాక్టర్‌ పద్మజ టీచింగ్‌ ఇంటర్న్‌షిప్‌ (ఏఐ డిజిటల్‌ లెర్నింగ్‌)పై రెండ్రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ గణపతిరావు మాట్లాడుతూ ఏఐ డిజిటల్‌ లెర్నింగ్‌పై శిక్షణ పొందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 30 రోజుల పాటు శిక్షణ అందిస్తారని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అనే అంశంపై శిక్షణ అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు అలివేలు, వెంకటేశ్‌, లక్ష్మీనర్సయ్యలు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

స్కూల్‌ బస్సుల విస్తృత తనిఖీలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలల బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి యోగేశ్వర్‌ జాదవ్‌ సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒకేసారి సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌, చేర్యాల, దుబ్బాక పట్టణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని అన్నారు. ఫిట్‌నెస్‌, పర్మిట్‌, రోడ్‌ టాక్స్‌, ఇన్సూరెనన్స్‌, పొల్యూషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు మంటలు ఆర్పే పరికరం, సైడ్‌ ఇండికేటర్స్‌, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, లాంటివి ప్రతి బస్సులో ఉన్నాయా లేదా అని పరిశీలించినట్లు తెలిపారు. అలాగే పరిమితికి మించి పిల్లలను బస్సులో తరలిస్తున్నారా? అనే విషయాలను పరిశీస్తున్నామన్నారు. నిబంధనలను అతిక్రమించిన పాఠశాలల యాజమాన్యాలపై కేసు లు చేసినట్లు తెలిపారు. తనిఖీ కార్యక్రమంలో మోటార్‌ వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌, శివ స్వప్న, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

చేర్యాల(సిద్దిపేట): ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 5 టిప్పర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి కథనం ప్రకారం... మండల పరిధిలోని ముస్త్యాల గ్రామ శివారులోని ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు అక్కడకు వెళ్లి మట్టి లోడుతో ఉన్న 5 టిప్పర్లను తనిఖీ చేశారు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవటంతో వాటిని స్టేషన్‌కు తరలించి, సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement