సిద్దిపేటఅర్బన్: వైద్య విద్యార్థులు సేవాభావంతో పాటు పర్యావరణ చైతన్యం కలిగి ఉండాలని సురభి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజ, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దినేష్‌సింగ్ అన్నారు. జాతీయ సర్జన్స్ వారోత్సవాల సందర్భంగా సోమవారం మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాల, అనుబంధ ఆస్పత్రిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సర్జన్స్ వీక్ సందర్భంగా నిర్వహించిన సామాజిక, విద్యాకార్యక్రమాలు విద్యా నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడుతాయని అన్నారు. సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించగా అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. వైద్య విద్యార్థుల్లో శస్త్రచికిత్స విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం క్విజ్ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జనరల్ సర్జరీ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ డా. ఐలయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


