నేటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

● విద్యార్థులకు స్వాగతం పలకనున్న ఉపాధ్యాయులు ● మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ ● నూతనంగా 86 ప్రీ ప్రైమరీ పాఠశాలలు పాత డ్రెస్సులతోనే.. వాటికే సీబీఎస్‌ఈ సిలబస్‌ అనుమతి

అన్ని ఏర్పాట్లు చేశాం

సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ
● విద్యార్థులకు స్వాగతం పలకనున్న ఉపాధ్యాయులు ● మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ ● నూతనంగా 86 ప్రీ ప్రైమరీ పాఠశాలలు

పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఇక ఆటపాటలకు గుడ్‌బై చెప్పి తరగతులకు హాజరుకానున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా, జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తరగతి గదులన్నీ శుభ్రం చేయించారు. రంగులు వేయించారు. మామిడి తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. జిల్లాలో 1005 ప్రభుత్వ పాఠశాలల్లో 1,03,203 మంది విద్యార్థులు, 239 ప్రైవేట్‌ పాఠశాలల్లో 83,146 మంది, 40గురుకులాల్లో 16,935 మంది విద్యను అభ్యసిస్తున్నారు.

– ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)

ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది నుంచే సర్కారు బడుల్లో ఉదయం అల్పాహారంతో పాటుగా మధ్యాహ్న భోజనం అందించనున్నారు. మర్కుక్‌ మండల కేంద్రంలో నూతనంగా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 19 వరకు నిర్వహించనున్నారు. బడిబయట విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా 86 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి.

విద్యార్థులు పాత యూనిఫామ్‌తోనే పాఠశాలలకు హాజరుకానున్నారు. ఈ విద్యాసంవత్సరానికి నూతన వస్త్రం ఇంకా జిల్లాకు చేరుకోలేదు. ఈ ఏడాది విద్యార్థుల డ్రెస్‌ కోడ్‌ సైతం మారింది. దీంతో వస్త్రం వచ్చాకే విద్యార్థులకు రెండు జతల డ్రెస్స్‌లు ఇవ్వనున్నారు.

జిల్లాలోని వర్గల్‌ నవోదయ, ఏన్సాన్‌పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో, సిద్దిపేటలోని మెరీడియన్‌, ప్రజ్ఞాపూర్‌లోని సెయింట్‌ మెరీ విద్యానికేతన్‌ పాఠశాలలో మాత్రమే సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తున్నారు. కానీ జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తున్నామంటు ఇష్టారీతిన ప్రకటనలు, హోర్డింగ్‌లు ప్రదర్శిస్తుండటం గమనార్హం.

జిల్లాలోని అన్ని పాఠశాలను సిద్ధం చేశాం. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులే కాకుండా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం.

–శాస్త్రి, జిల్లా విద్యాశాఖ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement