సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ప్రతీ ఏటా అకాల వర్షాలు అతివృష్టి, అనావృష్టితో రైతుల పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని దిక్కుతోచని పరిస్థితి. వరుణుడి కోసం ఎదురుచూస్తూ పంటల సాగును చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రైతులకు చల్లని కబురు తీసుకొచ్చింది. సకాలంలో రైతులకు వాతావరణ సూచనలు, వర్షాలు, పిడుగుల సమాచారాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలు ఐఎండీ, ఐకార్ సహకారంతో పలు రకాల యాప్‌లను రూపొందించింది. ఇందులోభాగంగా మేఘ్‌దూత్, కిసాన్ సువిధ, రెయిన్ అలారం, దామిని యాప్‌లను రూపొందించి, రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ల ద్వారా రైతులు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. ఇందులో కొన్ని యాప్‌లు ముందస్తు సమాచారాన్ని కూడా అందిస్తున్నాయి.
మేఘ్‌ధూత్‌లో ముందస్తు సమాచారం
మేఘ్‌ధూత్ యాప్‌లో రానున్న నాలుగు రోజుల వాతావరణ సమాచారాన్ని రైతులు ముందే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌లో వారం క్రితం నాటి సమాచారంతోపాటుగా ప్రస్తుత సమయంలో ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం సమాచారాన్ని పొందవచ్చు. ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా ఈ యాప్ ద్వారా ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వర్ష సూచనలను నిరంతరం తెలుసుకునేందుకు రెయిన్ అలారం, కిసాన్ సువిధ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. వాతావరణంతోపాటుగా మార్కెట్ ధరలు, పంటల భీమా సమాచారం, విత్తనాలు,ఎరువులు,నీటి నిర్వహణపై పలు సూచనలు ఈ యాప్‌లో రైతులకు అందుబాటులో ఉన్నాయి.
దామిని యాప్‌లో పిడుగుల సమాచారం
ఉరుములు, మెరుపులు, పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని దామిని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పిడుగులు ఎక్కడ పడే అవకాశం ఉందో ఈ యాప్ రైతులకు సూచిస్తూ ప్రాణాలను కాపాడుతుంది.
వాతావరణ సమాచార యాప్‌లను
రూపొందించిన కేంద్రం
ముందస్తు పిడుగులు,
వర్ష సమాచారం రైతులకు చేరవేత
అందుబాటులో మేఘ్‌దూత్, కిసాన్ సువిధ,
రెయిన్ అలారం, దామిని యాప్‌లు


