చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకున్న అధికారులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పాఠశాలకు వెళ్లిన తొలిరోజు ఎప్పుడూ మర్చిపోలేని మధురానుభూతి. మొదట ఎవరికైనా భయమే. కానీ అక్కడికి వెళ్లాక మిత్రులు, ఉపాధ్యాయులతో గడిపిన రోజులు నిరంతరం గుర్తుకు వస్తూనే ఉంటాయి. పాఠశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రొఫెసర్, అధికారులను సాక్షి పలకరించగా తమ అనుభవాలను, సంతోషాలను ఇలా పంచుకున్నారు.
మొదటి రోజు ఏడ్చా..
పాఠశాల ప్రారంభం రోజు బాగా ఏడ్చా. తర్వాత అలవాటు పడ్డాను. మొదట పెద్దబాలశిక్షను బుచ్చయ్య పంతులు ఎంతో బాగా బోధించేవారు. పద్యాలు సుమతి శతకాలు కంటస్థం చేశా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివాను. హనుమకొండ మర్కాజి స్కూల్‌లో 10త తరగతి వరకు, అలాగే హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివాను. ఆ రోజుల్లో దాదాపు 8 కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేది.
– డి.రాజీ రెడ్డి, ఉప కులపతి, ఉద్యాన యూనివర్సిటీ
పెద్దనాన్నే నా మొదటి గురువు
పెద్ద నాన్న నర్సిరెడ్డి నా మొదటి గురువు. పెద్దనాన్నతోపాటు పీఈటీ రామచంద్రయ్య, ఫాదర్ విలియమ్స్, ఆంటోనీ ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. పాఠశాలలు పునఃప్రారంభైన తర్వాత చాలా రోజులు సెలవుల్లో ఆడిన ఆటలు విశేషాలను స్నేహితులతో చర్చించుకునే వాళ్లం. స్కూల్ బాల్యం.. జీవితం లో ఎదిగేందుకు ఎంతో ముఖ్యమైనది.
– రవీందర్ రెడ్డి, సిద్దిపేట ఏసీపీ
తల్లిదండ్రులతో కలిసి వెళ్లాను
నేను మొదటి రోజు నా తల్లిదండ్రులతో కలిసి వెళ్లాను. హైదరాబాద్‌లోని మీర్ అలం మండి యూపీఎస్ పాఠశాలలో చదివాను. ఉపాధ్యాయులు మమ్మల్ని మంచిగా చూసుకునేవారు. మా మిత్రులతో కలిసి శ్రద్ధగా చదువుకునేవాళ్లం. సెలవుల తరువాత మొదటి రోజు పాఠశాలకు వెళ్లాలంటే ఇష్టం ఉండేదికాదు. ఇంటి వద్ద స్నేహితులతో కలిసి ఆటలు అడేవాడిని.
–వరగంటి శాస్త్రి, జిల్లా విద్యాశాఖ అధికారి


