మంత్రి తుమ్మలను కోరిన
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, వ్యవసాయ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విన్నవించారు. ఈ మేరకు ఆదివారం మంత్రిని కలిసి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయని, ప్రతి మార్కెట్‌కు 40 వేల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం కల్పిస్తూ మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల అధునిక గోధాంలు మంజూరు చేయాలన్నారు. రైతులకు యూరియా, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. విన్నపాలను వెంటనే అమలు అయ్యేలా చూడాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
కార్మిక సంఘం
జిల్లా కమిటీ ఎన్నిక
సిద్దిపేటఅర్బన్: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తాడూరి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా రాళ్లబండి శశిధర్ ఎన్నికయ్యారు. కొమురవెల్లి మండల కేంద్రంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోగా ఆదివారం ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, శాతరాసి శ్రీనివాస్, బాలమణి, సహాయ కార్యదర్శులుగా తాడూరి కవిత, పొట్టేల స్వామి, తాటోజు రవీంద్రచారిలతో పాటు మరో 12 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.


