కేసీఆర్‌ను కలిసిన వంటేరు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కలిసిన వంటేరు

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

గజ్వేల్‌రూరల్‌: ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా శనివారం మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ప్రతాప్‌రెడ్డి తన కొడుకుతో కలిసి కేసీఆర్‌ ఆశీర్వాదాలు తీసుకున్నారు. కాగా బీఆర్‌ఎస్‌ నాయకులు గజ్వేల్‌లో రక్తదానంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు

సిద్దిపేటఅర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు అన్నారు. సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సీపీఎం జెండావిష్కరణ చేసి మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న అసమానతలు పారదోలాలన్నా, ప్రజలందరికి సమాన పనికి సమాన వేతనంతో పాటు సుఖవంతమైన జీవితాన్ని అందించడం కోసం కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకుడు బండారు రమేష్‌ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి వివరించారు. మతం, మతోన్మాదం తరగతులను పిట్టల రవి బోధించారు. ప్రిన్సిపాల్‌గా శశిధర్‌ వ్యవహరించారు. శిక్షణ తరగతుల్లో జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్‌, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, యాదగిరి, రవికుమార్‌, అరుణ్‌కుమార్‌, బాలనర్సయ్య, రవీందర్‌, నవీన, శిరీష, తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు

రీజినల్‌ మేనేజర్‌ విజయ్‌ భాస్కర్‌

సంగారెడ్డి టౌన్‌: త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ విజయ్‌ భాస్కర్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై సంబంధించిన అన్ని సాంకేతిక ,ఆర్థిక పరిపాలనపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ మధుసూదన్‌ పాల్గొన్నారు.

అంజన్న సన్నిధిలో

భక్తజన సందడి

శివ్వంపేట(నర్సాపూర్‌): చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి పూజలు నిర్వహించారు. దంపతులు అభిషేకం అనంతరం సత్యనారాయణస్వామి మండపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. మండల పరిధిలోని ఉసిరికపల్లికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు కృష్ణారావు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి భక్తులు వస్తు, ధన రూపంలో సహాయం అందించాలని ఈఓ శ్రీనివాస్‌, ఆలయ చైర్మన్‌ ఆంజనేయశర్మ కోరారు.

415 కేంద్రాల్లో

కొనుగోళ్లు పూర్తి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఇప్పటివరకు 415 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 90,669 రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 73,429 మంది రైతుల ఖాతాల్లో రూ.786 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించామని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement