ముందుకు కదలని రింగురోడ్డు అంశం
గజ్వేల్ రింగు రోడ్డు అనుసంధానం అంశం మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు పనులు అసంపూర్తిగా ఉన్న ప్రదేశాన్ని సందర్శించడం, భూ బాధితులు మంత్రి దామోదర రాజనర్సింహను కలవడంతో.. పనులు పూర్తవుతాయనే హడావిడి నెలకొంది. బాధితుడు రైతు రామచంద్రానికి న్యాయం చేస్తే పనులకు మార్గం సుగమమవుతుందని అంతా భావించారు. కానీ పరిస్థితి భిన్నంగా మారడంతో ముందుకు వెళ్లని పరిస్థితి నెలకొంది. – గజ్వేల్
గజ్వేల్ రింగు రోడ్డు పనులు
ఆగిపోయిన ప్రదేశం ఇదే
గజ్వేల్ రింగురోడ్డు పనులు పట్టణంలోని సంగాపూర్ రోడ్డు వైపున రైతు రామచంద్రం పొలం వద్ద కేవలం 150మీటర్ల పనుల పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల్ల పదేళ్లుగా వందశాతం అనుసంధానం పూర్తికాలేదు. ఫలితంగా రింగు రోడ్డు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. అప్పటి సీఎం కేసీఆర్ ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రూ.330కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. కానీ కేవలం 150మీటర్ల గ్యాప్ వల్ల రోడ్డు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ప్రస్తావించి.. బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆగిపోయాయని, తాము పూర్తి చేస్తామని ప్రకటించారు. కాగా మార్చి 22న జిల్లాలోని నంగునూరు మండల నర్మెట్టలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సైతం రింగు రోడ్డు అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఏప్రిల్ 11న రింగు రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్న రామచంద్రం పొలం వద్ద స్వయంగా పరిశీలన జరిపారు. రైతుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, లేదంటే చట్టప్రకారం ముందుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఎంపీ ప్రకటన తర్వాత అధికారుల నుంచి తరుచూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆందోళనకు గురైన బాధిత రైతు, తన భార్య, కుమారునితో కలిసి గత ఏప్రిల్ 20న మంత్రి దామోదరను కలిశారు. ఈ పరిణామాల తర్వాత రామచంద్రానికి న్యాయం చేసి అధికారులు పనులు పూర్తి చేస్తారని అంతా భావించారు. కానీ పరిస్థితి మళ్లీ మొదటికి రావడం ఆందోళన కలిగిస్తున్నది.
రెండు నెలల కిందట హడావిడి
ప్రస్తుతం స్తబ్దుగా పాలకులు
ఇప్పట్లో పనులు పూర్తయ్యేఅవకాశం లేనట్టేనా?
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సర్వత్రా చర్చ
అసలేం జరిగింది?
రింగు రోడ్డులో భూమిని కోల్పోయిన బాధిత రైతు రామచంద్రం.. భూమికి, భూమి ఇవ్వాలని, లేదా మెరుగైన పరిహారం ఇవ్వాలని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2023లో సదరు రైతుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో అతనికి న్యాయం చేయడానికి అధికారులు ఇటీవల సర్వే జరిపినట్లు తెల్సింది. ఈ సర్వేలో రింగు రోడ్డు నోటిఫికేషన్ నాటికి సదరు రైతు సుమారు ఎకరాకుపైగా భూమి కోల్పోతున్నట్లు ఉంటే.. తాజాగా జరిపిన సర్వేలో గతంలో ఉన్నదానికంటే అధికంగా భూమి కోల్పోతున్నట్లు తేలిందని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే బాధిత రైతుకు పరిహారం పంపిణీపై ఏరకంగా ముందుకు వెళ్లాలో స్పష్టత లేక, అధికారులు ఈ అంశాన్ని మరోసారి పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై మరోసారి ఉన్నతస్థాయిలో నిర్ణయం జరిగితే తప్ప పనులు ముందుకు సాగవని పలువురు అంటున్నారు.


