త్వరలో జిల్లాకు చేరనున్న వస్త్రం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న రెండు జతల దుస్తుల కలర్ మారింది. త్వరలోనే మారిన వస్త్రం జిల్లాకు చేరనుంది. జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, యూఆర్‌ఎస్, ఎయిడెడ్, టీఎస్‌ఆర్, లోకల్‌బాడీ, జిల్లా పరిషత్ పాఠశాలలు 980 ఉన్నాయి. అందులో 81,229 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. లైట్ బ్లూ కలర్ షర్ట్, నేవి బ్లూ కలర్ బాటమ్ (ప్యాంట్‌లు) దుస్తులు అందించనున్నారు. అయితే వస్త్రం జిల్లాకు చేరగానే మండలాల్లోని మహిళా సమైఖ్యల ద్వారా కుట్టించి విద్యార్థులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
కురుమలు
అన్ని రంగాల్లో రాణించాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కురుమలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కురుమ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికాంత్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కురుమ ఉద్యోగుల సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా అగ్నివీర్ ద్వారా భారత సైన్యంలో ఉద్యోగాలు సాధించిన కురుమ యువతను ఘనంగా సన్మానించారు. రవికాంత్ మాట్లాడుతూ కురుమలు కేవలం ఉద్యోగులు మాత్రమే కాకుండా, రాజకీయాలు, ఆర్థికంగా ముందంజలో ఉండాలన్నా రు. సంఘం చేస్తున్న సేవలు, కృషి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని అగ్నివీర్‌లో ఉద్యోగాలు సాధించిన యువత అన్నారు. కార్యక్రమంలో కురుమ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు శ్రీకాంత్, మల్లేశం, రాములు, కురుమ సంఘం నాయకులు కోరె ఎల్లయ్య, ప్రభాకర్, రమేష్, రాజు పాల్గొన్నారు.
మహిళా సంఘాల
డబ్బు మాయం
సీఏపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు
చేర్యాల(సిద్దిపేట): మహిళా సంఘాల పొదుపు లెక్కలు చూసే సీఏ లక్షల రూపాయలు మాయం చేసిన ఘటన మండల పరిధిలోని దానంపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దానంపల్లి సీఏ మమత ఆదే గ్రామానికి చెందిన శ్రీసాయి మహిళా సంఘానికి సంబంధించిన రూ.1.50లక్షలు సంఘ సభ్యుల ప్రమేయం లేకుండానే మరో ఖాతాకు బదిలీ చేశారు. అలాగే ఓ మహిళను సంఘంలో చేర్పించి రూ.2లక్షల రుణం ఇప్పించారు. ఇలా మొత్తంగా సంఘానికి చెందిన రూ.3.5లక్షలు పక్కదోవ పట్టించారు. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సంఘ సభ్యులు స్థానిక ఎస్బీఐ అధికారులకు సదరు సీఏపై ఫిర్యాదు చేశారు. ఈ తతంగం బయటకు పొక్కడంతో మిగతా సంఘాల సభ్యులు కూడా తమ డబ్బులను ఇలాగే చేశారంటూ ఆరోపించారు. ఇలా మొత్తంగా మహిళా సంఘాలకు చెందిన సుమారు రూ.15 లక్షల వరకు మాయం చేసి ఉంటారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా మహిళా సంఘాల డబ్బులు మాయం చేసిన సీఏపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడగా సంఘం డబ్బుల్లో అవకతవకలకు పాల్పడినట్లు సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు.


