చెత్త సేకరణ ఇక భారమే! | - | Sakshi
Sakshi News home page

చెత్త సేకరణ ఇక భారమే!

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

ఇప్పటికే పలు కాలనీలకు సమాచారం మున్సిపల్‌ యంత్రాంగం నిర్ణయంపై విమర్శలు

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో చెత్త

సేకరణ ఇక భారం కానుంది. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలు కాలనీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సిబ్బంది, వాహనాల కొరత కారణంగా

వేగవంతమైన సేవల కోసం మున్సిపల్‌

యంత్రాంగం ఈ నిర్ణయానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

– గజ్వేల్‌

జ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉండగా.. జనాభా 80వేల పైచిలుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్‌ టన్నుల పైనే. కానీ మున్సిపాలిటీలో సిబ్బంది, వాహనాల కొరత శాపంగా పరిణమించింది. ఇక్కడ 160మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. నిజానికి మరో 80 మందికిపైగా సిబ్బంది అవసరం. 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో పదికిపైగా వాహనాలు అవసరమున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే పారిశద్ధ్య సమస్యను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో. .ఇన్‌ఛార్జితో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా తడి, పొడి చెత్త సేకరణ సక్రమంగా సాగటం లేదు. చెత్త బండ్లు సకాలంలో రాకపోవడంతో పలు కాలనీల్లో ఇంటి యజమానులు కవర్లలో చెత్తను తీసుకొచ్చి రోడ్లపై పారబోస్తున్నారు. దీంతో ఆయా రోడ్లు కంపుకొడుతున్నాయి. మరోవైపు డంపింగ్‌ యార్డు నిర్వహణ సైతం అధ్వానంగా మారింది. యార్డులో తరుచూ మంటలు చెలరేగి.. పట్టణంలో దట్టమైన పొగలు కమ్ముకొని ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. అంతేకాకుండా వర్మీకంపోస్ట్‌ తయారీ, బయోమైనింగ్‌ ప్రక్రియ కూడా నామమాత్రంగా సాగుతోంది.

ప్రైవేటీకరణ దిశగా చర్యలు

ప్రైవేటీకరణకే మొగ్గు..

సిబ్బంది, వావాహనాల కొరత కారణంగా పారిశుద్ధ్య నిర్వహణ భారంగా మారటంతో మున్సిపల్‌ యంత్రాంగం, పాలకవర్గం ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం కారణంగా ఈ పట్టణం ఆదర్శ మున్సిపాలిటీగా కీర్తిని తెచ్చుకుంది. పేరుకు తగ్గట్టుగా నిధుల వరద పారింది. కానీ నేడు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా సాగాలంటే.. ప్రైవేటీకరణే తరుణోపాయంగా భావించి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పట్టణంలోని పలు కాలనీలకు సమాచారమిచ్చినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి చెత్త సేకరణకు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాలని సూచించినట్లు వినికిడి. ఈ విధానాన్ని ముందుగా కొన్ని కాలనీల్లో అమలు చేసి...భవిష్యత్తులో అన్ని కాలనీల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. మున్సిపల్‌ నిర్ణయం ఎలా వున్నా.. చెత్త సేకరణ ప్రైవేటీకరణపై పట్టణ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement