ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మామిడి పండ్ల ఎగుమతి, ఉత్పత్తులపై గురువారం రైతులకు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన ఏపీఈడీఏ సంస్థకు చెందిన ఏజీఎం ఆర్‌పీ నాయుడు, బీడీఎం బాష మాట్లాడుతూ మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయడంపై అవగాహన కల్పించారు. గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలు, పంటలో అవశేషాల నియంత్రణ, నాణ్యత ప్రమాణాలు, గ్రేడింగ్, ప్యాకింగ్, కోల్డ్ చైన్ నిర్వహణ, ఎగుమతి విధానాలపై విపులంగా వివరించా రు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు రైతులకు పలు సూచనలిచ్చారు. అనంతరం అతిథులను వర్సిటీ అధికారులు సత్కరించారు.
పథకాలు సద్వినియోగం చేసుకోండి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
మిరుదొడ్డి(దుబ్బాక): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. గురువారం మండల పరిధిలోని అందె గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్ధతు ధరను పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, సర్పంచ్ యాదగిరి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, జిల్లా నాయకుడు సూకూరి లింగం తదితరులు పాల్గొన్నారు.
మహిళలు
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
గజ్వేల్: స్వయం సహాయక మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ చందన ఆకాంక్షించారు. గురువారం గజ్వేల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధర్యంలో ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’లపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉన్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యన్‌కర్ పద్మాబాయి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


