లాభాలు మెరుగు
వెదజల్లు..
పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు
● కూలీల కొరత అధిగమించొచ్చు ● అవగాహన కల్పిస్తున్న అధికారులు
పొలంలో విత్తనాలు
వెదజల్లుతున్న రైతు(ఫైల్)
చిన్నకోడూరు(సిద్దిపేట): వరిలో విత్తనాలు వెదజల్లే పద్ధతి అన్నదాతలను అనేక విధాలుగా ఆదుకుంటోంది. తక్కువ ఖర్చుతోపాటు కూలీల కొరతను అధిగమించే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా వ్యవసాయ అధికారులు దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. లాభాలు ఉండటంలో చాలా మంది రైతులు యాసంగిసాగులో ఎక్కువగా వెదజల్లే పద్థతి వైపే మొగ్గు చూపుతున్నారు.
విత్తనాలూ.. తక్కువే
మొలకెత్తిన విత్తనాలను నేరుగా దమ్ము చేసిన పొలంలో వెదజల్లుతారు. దీంతో నారుపోయడం, నాటు వేయడం వంటి వాటికి చేసే ఖర్చు ఆదా అవుతోంది. అలాగే కూలీల కొరతను కూడా అధిగమించవచ్చు. నారు పోయడానికి ఎకరాకు 30 కిలోల విత్తనం వినియోగిస్తుండగా, నేరుగా వెదజల్లే పద్ధతిలో ఎరకరాకు 12 నుంచి 18 కిలోల విత్తనం సరిపోతుంది. అంటే సుమారు సగానికి పైగా విత్తనాలకు ఖర్చు తగ్గుతుంది. ఈ యాసంగి సాగులో మండల వ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా అందులో 30 శాతం మంది రైతులు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు.
ఎకరాకు రూ.10 వేలు ఆదా
వెదజల్లే పద్ధతిలో సాగుచేస్తే నారు, నాట్ల ఖర్చు ఉండదు. పంట పది రోజులు ముందుగానే కోతకు వస్తుంది. దిగుబడి కూడా 10 నుంచి 15 శాతం అధికంగా వస్తుంది. ఎకరాకు రూ.6 నుంచి రూ.10 వేల వరకు ఆదా అవుతాయి. వెదజల్లే ముందు విత్తనాలను 24 గంటలు మండే కట్టాలి. మొలకెత్తిన తరువాత దమ్ము చేసిన పొలంలో వెదజల్లాలి. పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉంచకూడదు.
కలుపు యాజమాన్యం
కలుపు నివారణకు 3 నుంచి 5 రోజుల మధ్యలో ఫైరజోల్ఫ్యూరన్ ఇథైలన్‌ను ఎకరాకు 80 నుంచి 100 గ్రాములు చొప్పున పొలంలో చల్లుకోవాలి. 15 రోజుల తర్వాత ఎరువులు వేయాలి.


