దుబ్బాకకు పైసా విదల్చని సర్కార్
సింగరాల మల్లన్నస్వామికి పూజలు
● రెండేళ్లలో కాంగ్రెస్ చేసింది శూన్యమే
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో నయాపైసా విదల్చలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో వచ్చిన నిధులను రద్దు చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందన్నారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దుబ్బాక మున్సిపల్ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రద్దుచేసిందన్నారు. ఎన్నికల ముందు ఆ నిధులతోనే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 13న దుబ్బాకలో మంత్రి వివేక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ అభివృద్ధి పేరిట కొత్త డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. మంత్రి వివేక్‌కు నిజంగా చిత్త శుద్ధి ఉంటే దుబ్బాక మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, రాజమౌళి తదితరులు ఉన్నారు.
తొగుట(దుబ్బాక): మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి సింగరాల మల్లన్న స్వామిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారి జాతర ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


