జిల్లా రద్దుకు రేవంత్ సర్కార్ కుట్ర
బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ
సిద్దిపేటకమాన్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో సిద్దిపేట జిల్లా రద్దుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర కు తెరలేపుతోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయి రాం ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో జిల్లాను రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని జిల్లా నుంచి వేరు చేస్తామనడం వెనక సిద్దిపేట జిల్లా రద్దుకు కుట్ర దాగి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా ఏర్పాటుకు పోరాటాలు జరిగాయన్నారు. కేసీఆర్ హయాంలో జిల్లా ఏర్పాటు కావడమేకాకుండా.. సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారన్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా రద్దుచేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో జిల్లా ప్రజల చేతిలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని హెచ్చరించారు. జిల్లా రద్దు విషయంపై మంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేనట్లయితే కాంగ్రెస్ నాయకులను జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు సోమిరెడ్డి, శ్రీనివాస్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పూల బాలకృష్ణారెడ్డి, మోహన్‌లాల్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


