ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం
● సిద్దిపేట బ్రాండ్‌తో ప్యాకింగ్
● రైతులతో హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్
సిద్దిపేటఅర్బన్: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మూడేళ్లుగా ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్న రైతులతో, ఆయిల్‌ఫెడ్ అధికారులతో కలిసి బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మొదట్లో ఆయిల్‌పామ్ సాగు అంటే భయం, అనుమానం ఉండేదని, ఇప్పుడు చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు. మూడేళ్లుగా ఆయిల్‌పామ్‌కు మంచి దిగుబడి రావడం శుభసూచకమని పేర్కొన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ తుది దశకు చేరుకుందన్నారు. నర్మెట రిఫైనరీలో తయారయ్యే నూనెను సిద్దిపేట బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేసేలా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కేంద్రం ఆయిల్‌పై 50శాతం సుంకం తగ్గించిందని, దీంతో రైతులకు సుమారు 2 వేలకు పైగా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. అంతర పంటగా కోకో వేసుకొని సంవత్సరానికి రూ. 80 వేల అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్స్ నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.


