పదిలో జిల్లా మెరవాలి
● వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ హైమావతి
● విద్యాశాఖ అధికారులతో సమావేశం
సిద్దిపేటరూరల్: జిల్లాలో పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ హైమావతి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, వివిధ గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో సాధించిన ఉత్తీర్ణత శాతం, ఈసారి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఉన్నత స్థానాలను సాధిస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు. అదే విధంగా ఈసారి కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు.
నేటి నుంచి ప్రత్యేక స్టడీ అవర్స్
ప్రతి పాఠశాలలో బుధవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. విద్యార్థులు వెనకబడి ఉన్న సబ్జెక్టులలో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. అంతకుముందు రహ దారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.
ఓటరు జాబితాలో అభ్యంతరాలు తెలపండి
ఓటరు జాబితాలో అభ్యంతరాలను తెలపాలని కలెక్టర్ హైమావతి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. పురపాలక ఎన్నికలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో జిల్లాస్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నా బాద్, దుబ్బాక, చేర్యాల, ప్రజ్ఞాపూర్– గజ్వేల్ మున్సిపాలిటీలలో త్వరలో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా వార్డులలో ఓటర్ జాబితాను రూపొందించినట్లు తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు.


