పర్యాటకంగా హుస్నాబాద్
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జిల్లెలగడ్డ అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే హైదరాబాద్ నుంచి పర్యాటకులు వస్తారన్నారు. పర్యాటకంగా అభివృద్ధి అయితే ఈ ప్రాంత యువతకు టూరిజంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఉమ్మాపూర్‌లో మహాసముద్రం, సర్వాయి పాపన్న కోటలు, కాలభైరవ క్షేత్రం, రాయికల్ వాటర్ పాల్స్ ఉన్నాయని, గుట్టల సమీపం నుంచే జాతీయ రహదారి ఉండటం వల్ల పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. అటవీలో వాచ్ టవర్‌తో పాటు, పిల్లల పార్కు, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి పనులకు ఎస్డీఎఫ్ నిధులను కేటాయించి పనుల్లో వేగం పెంచుతామన్నారు. అనంతరం పీసీసీఎఫ్ సువర్ణ మాట్లాడుతూ... యువత ట్రెక్కింగ్ చేయడానికి ఎత్తయిన గుట్టలు ఉన్నాయని, హరిత నిధుల నుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కు నిధులు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, డీఎఫ్‌ఓ పద్మజ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, శివయ్య, సర్పంచ్‌లు స్వరూప, ప్రశాంత్‌లు, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.
గౌరవెల్లి బాధ్యత నాదే
గౌరవెల్లి ప్రాజెక్టుకు నీరు తీసుకొచ్చే బాధ్యత తనదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాల్వను 15 కి.మీలు దూరం బైక్‌పై వెళ్లి పరిశీలించారు. నియోజకవర్గంలో మైనర్ కాల్వలకు 1200 ఎకరాల భూ సేకరణకు రూ.250 కోట్ల నిధుల విడుదల చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తే 57 వేల ఎకరాలు, గండిపెల్లి ప్రాజెక్టు ద్వారా మరో 14 వేల ఎకరాలకు సాగు నీరు అందుతాయని పేర్కొన్నారు. చెరువులు నింపితే మరో 35 వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
అర్బన్ ఫారెస్ట్ పార్కు పనులకు
శంకుస్థాపన


