సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సిద్దిపేటకమాన్: విద్యా సంస్థలకు వరుస సెలవులు రావడం, సంక్రాంతి నేపథ్యంలో విద్యార్థులు, ప్రజలు పట్నం నుంచి పల్లె బాట పట్టారు. వివిధ పనులు, విద్యా, ఉద్యోగ రీత్యా పట్టణాల్లో ఉంటున్నవారు పండుగకు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సిద్దిపేట ఆర్టీసీ మోడ్రన్, నూతన బస్టాండ్‌లో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏ బస్సు చూసినా ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండటంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
48 అదనపు సర్వీసులు
సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ డిపోల పరిధిలో బస్సుల ద్వారా ప్రతి రోజు ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. సిద్దిపేట డిపోలో 63 ఆర్టీసీ, 53 అద్దె, దుబ్బాక డిపోలో 29 ఆర్టీసీ, 08 అద్దె, గజ్వేల్‌ప్రజ్ఞాపూర్ డిపో పరిధిలో 42 ఆర్టీసీ, 28 అద్దె, హుస్నాబాద్ డిపో పరిధిలో 40 ఆర్టీసీ, 22 అద్దె బస్సులతో కలిపి నాలుగు డిపోల పరిధిలో మొత్తం 285 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు ప్రతిరోజు జేబీఎస్, హైదరాబాద్, వరంగల్, హుస్నాబాద్, కరీంనగర్, వేములవాడ, జగిత్యాల, యాదగిరిగుట్ట, కామారెడ్డి, రామాయంపేట, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, భువనగిరి, బీదర్ వంటి పలు దూర ప్రాంతాలతోపాటు పలు గ్రామాలకు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ.. 48 అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. సిద్దిపేట నుంచి జేబీఎస్‌కు ప్రతి పదిహేను నిమిషాలకు ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. పండగ అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ
285 బస్సులతో
ప్రయాణికులకు సేవలు
పండుగకు 48 అదనపు సర్వీసులు
ప్రయాణికుల రద్దీకి
అనుగుణంగా ఏర్పాట్లు
సెలవులతో పల్లెలకు వెళ్తున్న
విద్యార్థులు


