జిల్లాను రద్దు చేస్తే ఉద్యమమే
గజ్వేల్: సిద్దిపేట జిల్లాను రద్దు చేయాలని చూస్తే మరో ప్రజా ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ కార్య నిర్వాహక అధ్యక్షుడు దేవి రవీందర్ హెచ్చరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాలను కుదిస్తామని వ్యాఖ్యానించడంపై శనివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం మాజీ సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలపై మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాపై కుట్రలను చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు మధు, మాజీ కౌన్సిలర్లు బాలేష్, చందు, బీఆర్‌ఎస్ నాయకులు పంబాల శివకుమార్, కళ్యాణ్‌కర్ నర్సింగరావు, గొడుగు స్వామి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటజోన్: సిద్దిపేట జిల్లా రద్దు కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా సాధన ఫోరం సభ్యులు హెచ్చరించారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవద్దని సూచించారు. సమావేశంలో ఫోరం ప్రతినిధులు రామచంద్రారెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, జనార్దన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


