
ఘటాభిషేకం.. చక్రతీర్థం
వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం
వర్గల్(గజ్వేల్): ఆధ్యాత్మిక పరిమళాలు పంచిన వర్గల్ వేణుగోపాలుని వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘటాభిషేకం, చక్రతీర్థంతో ముగిశాయి. ఘటాభిషేకంలో భాగంగా అర్చ కులు ఆలయ మండపంలో వేదికపై రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులను అధిష్ఠించారు. 21 కలశాలు స్థాపన చేసి పూజలు చేశారు. గర్భగుడిలో మూలవిరాట్టులకు ఘట కలశాభిషేకం నిర్వహించారు. దేవతామూర్తులను పట్టు వస్త్రాలు, పూలమాలికలు, సర్వాభరణాలతో కమనీయంగా అలంకరించారు. వసంతోత్సవం అనంతరం ఆలయ కోనేరులో చక్రతీర్థం నిర్వహించారు.
పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు
సిద్దిపేటకమాన్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే బీఎన్‌ఎస్‌ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ నెల 22నుంచి 29వ తేదీ వరకు 27 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షలు జరగనున్న సమయంలో ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ప్రజలు గూమిగూడి ఉండకూడదని తెలిపారు. కేంద్రాలకు సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసి వేసి ఉంచాలన్నారు. పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తిరంగా రన్
సిద్దిపేటజోన్: భవిష్యత్తులో యుద్ధ వాతావరణం ఏర్పడితే యువత యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో సైన్యానికి మద్దతుగా తిరంగా రన్ నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ విధుల్లో కొనసాగింది. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన దేశ సైనికుల త్యాగం గొప్పదని కొనియాడారు. సైనికులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బాపురెడ్డి, నారాయణరెడ్డి, జీవన్, లింగారెడ్డి, రాజిరెడ్డి, రమేష్, చంద్రశేఖర్, రవి, అశోక్, వీరన్న, జగదీశ్, శ్రీనివాస్, పండరి తదితరులు పాల్గొన్నారు.

ఘటాభిషేకం.. చక్రతీర్థం