
త్వరలోనే భూ సమస్యలు కొలిక్కి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హుస్నాబాద్: భూ భారతి చట్టం ద్వారా ఆగస్టు 15లోగా వీలైనంత వరకు భూ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం ఘనపూర్‌లో భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి మంగళవారం మంత్రి పొంగులేటి హెలికాప్టర్ ద్వారా పట్టణంలోని మినీ స్టేడియంలో గల హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరి ఘన స్వాగతం పలికారు. అనంతరం పొన్నం ప్రభాకర్‌తో కలిసి రోడ్డు మార్గం ద్వారా ఘనపూర్‌కు మంత్రి శ్రీనివాస్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే సర్వేయర్లను నియమిస్తామని, వారికి 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి ప్రతి రెవెన్యూ మండలానికి 8 మంది తగ్గకుండా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఇందిరమ్మ లబ్ధిదారులను ప్రకటిస్తాం
మొదటి దశ 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే ప్రకటించామని, ఈ నెలాఖరు లోపు లబ్ధిదారులను ప్రకటిస్తామని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లతో పాటు అదనంగా అక్కడే ఉండే గిరిజనుల సంఖ్య మేరకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.