
మెప్మా అక్రమాలపై విచారణ ముమ్మరం
త్వరలోనే నివేదిక అందజేస్తాం: ఆడిట్ అధికారి వెల్లడి
గజ్వేల్‌రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా రుణాల అక్రమాలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈనెల 15న విచారణ చేపట్టిన జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రెండో విడత విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐదు మహిళా సంఘాల గ్రూపు సభ్యులను పిలిపించుకొని విచారణ జరిపారు. సభ్యుల పేరిట రూ. 2లక్షల రుణాలు ఇప్పించి, తిరిగి అదే సభ్యుల నుంచి మెప్మా అధికారితో పాటు ఓ ఆర్పీ డ్రా చేయించుకొని తీసుకున్నట్లు బయటపడింది. అంతేగాకుండా మహిళా సంఘాల సభ్యులు పొదుపు చేసుకున్న డబ్బులను సైతం వీరు వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. జిల్లా ఆడిట్ అధికారి.. మహిళా సభ్యురాళ్ల నుంచి సమగ్రంగా వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆడిట్ అధికారి జయశ్రీ మాట్లాడుతూ ఈనెల 15న మొదటిసారి 3 గ్రూపుల్లో విచారణ చేపట్టామన్నారు. తాజాగా మరో 5 మహిళా గ్రూపుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లోని పొదుపు డబ్బులను సైతం మెప్మా అధికారితో పాటు సిబ్బంది తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఆయా మహిళా సంఘాలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలను అదనపు కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, ఆడిట్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తం
హుస్నాబాద్‌రూరల్: గ్రామీణ మహిళలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్ లీడర్ సదయ్య సూచించారు. పోతారం(ఎస్) గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం అవగాహన కల్పించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపుల గురించి ధైర్యంగా పోలీసులకు చెబితే సత్వరం న్యాయం జరుగుతుందన్నారు. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నేరస్తులకు శిక్ష పడేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.