సిద్దిపేటఎడ్యుకేషన్: స్పష్టమైన లక్ష్యం, నిర్ధిష్టమైన ప్రణాళికతో చదివితే సివిల్ సర్విసెస్‌లో విజయం సాధించవచ్చని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్, కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కళాశాలలో సివిల్ సర్విసెస్ పరీక్షలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిగ్రీ తర్వాత విద్యార్థులకు ఎలాంటి కెరీర్‌ను ఎంచుకోవాలో కొంత ఆస్పష్టత ఉంటుందన్నారు. స్పష్టమైన ఆలోచనతో కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. భాషపై పట్టు, సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉంటే తెలుగులో కూడా సివిల్స్‌లో విజయం సాధించవచ్చన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ దినపత్రికలను చదవాలని సూచించారు. తాను మొదటి సారి సివిల్స్ సాధించి విషయాన్ని విద్యార్థులకు వివరిస్తూ, అవసరమైన పుస్తకాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉండే పేపర్లు, మార్కుల విధానం, ఇట ర్వ్యూకు ఎలా సిద్ధం కావాలో, రిఫరెన్స్ పుస్తకాలు, నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి తదితర అంశాలను విపులంగా వివరించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. సుమారు రెండు గంటల పాటు సమయాన్ని కేటాయించి విద్యార్థులకు సివిల్స్ పరీక్షలపై అవగాహన కల్పించిన కలెక్టర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత అధ్యాపకులు సన్మానించి, జ్ఞాపికను అందించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ విభాగం సెక్టోరల్ అధికారి రామస్వామి, కళాశాల టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, డాక్టర్ మధుసూదన్, ఏఓ సులేమాన్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ మనుచౌదరి
సివిల్స్‌పై విద్యార్థులకు అవగాహన


